Bank Holidays: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. మే 23, 2026 నుంచి మే 28 వరకు వరుసగా ఆరు రోజుల పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో SBI బ్రాంచ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని సమాచారం. ఈ సమయంలో బ్యాంక్‌కు వెళ్లి చేయాల్సిన పనులు ఉన్నవారు ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ అంతరాయానికి కారణంగా వీకెండ్ సెలవులు, ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె, అలాగే బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సెలవులు కలిసివచ్చినట్లు తెలుస్తోంది. మే 23న నాలుగో శనివారం, మే 24న ఆదివారం కావడంతో సాధారణంగానే బ్యాంకులు మూసివేయబడతాయి.
ఆ తర్వాత మే 25, 26 తేదీల్లో ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA) కూడా మద్దతు తెలిపింది. ఖాళీల భర్తీ, భద్రతా సిబ్బంది నియామకం, ఔట్సోర్సింగ్ విధానానికి వ్యతిరేకత, పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు వంటి డిమాండ్లతో ఈ ఆందోళన జరుగుతోంది.
దీని తర్వాత మే 27, 28 తేదీల్లో బక్రీద్ పండుగ సెలవులు రావడంతో దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సెలవులు వర్తించే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో అయితే వరుసగా రెండు రోజులు బ్యాంకులు మూసివేయబడనున్నాయి.
ఈ విధంగా వీకెండ్, సమ్మె, పండుగ సెలవులు కలిసిరావడంతో మొత్తం ఆరు రోజుల పాటు బ్రాంచ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. అయితే SBI ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, UPI లావాదేవీలు, ATM సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని బ్యాంక్ వర్గాలు స్పష్టం చేశాయి.








