విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా 20 ట్రాక్టర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఘటన గ్రామస్తుల ఆందోళనకు కారణమైంది. ప్రభుత్వ భూములను టార్గెట్ చేస్తూ మాఫియా నిరభ్యంతరంగా దందా సాగిస్తోంది.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, నంబర్ ప్లేట్లు లేకుండా, లైసెన్స్ లేని డ్రైవర్లతో మట్టిని అధిక వేగంతో తరలిస్తున్న మాఫియా పోలీసులను సైతం లెక్కచేయడం లేదు. రోడ్డుపై ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ ఇవే ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణాలో పట్టుబడ్డాయి. రెండు సార్లు విడవలూరు, అల్లూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనప్పటికీ, రాజకీయ ఒత్తిడితో ట్రాక్టర్లు విడిపించుకుని మాఫియా యథావిధిగా తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
ఇకనైనా సంబంధిత అధికారులు మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటారా? లేక మరింత రెచ్చిపోవడానికి వీలు కల్పిస్తారా? అనే ప్రశ్న స్థానికుల మదిలో తలెత్తుతోంది. ప్రభుత్వ భూములను కాపాడేందుకు కఠినంగా వ్యవహరించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.