రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Ryan Parag) వివాదంలో చిక్కుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ (ఇ-సిగరెట్) చేస్తున్న దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారంలో కనిపించడం తీవ్ర చర్చకు దారితీసింది. మ్యాచ్‌లో 16వ ఓవర్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా, వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
స్టేడియం ప్రాంగణం లేదా డ్రెస్సింగ్ రూమ్‌లో ధూమపానం చేయడం ICC(International Cricket Council) మరియు BCCI నిబంధనల ప్రకారం నిషేధం. ఈ నేపథ్యంలో పరాగ్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనపై బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టే అవకాశముంది. భారత్‌లో 2019 నుంచి ఇ-సిగరెట్ల విక్రయం, వినియోగంపై నిషేధం అమల్లో ఉన్నందున, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే పరాగ్‌పై భారీ జరిమానా లేదా మ్యాచ్ సస్పెన్షన్ విధించే అవకాశముంది. కొన్ని విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.
కెప్టెన్‌గా బాధ్యతాయుతమైన స్థితిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడటంపై నెటిజన్లు, మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం లేదా బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.








