అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో మరో సంచలన నిర్ణయం వెలువడింది. అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని ట్రంప్ ముఖచిత్రంతో ప్రత్యేక యూఎస్ పాస్‌పోర్టులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది(US passports with Donald Trump). ఈ పాస్‌పోర్టులు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులోకి రానున్నాయని యూఎస్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ ఎక్స్ వేదికగా మాట్లాడుతూ, జులైలో జరగనున్న 250వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఈ ప్రత్యేక పాస్‌పోర్టులు విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ పాస్‌పోర్టులకు అదనపు రుసుము ఉండదని స్పష్టం చేశారు.
వైట్ హౌస్ కూడా ఈ నిర్ణయాన్ని ధ్రువీకరించడంతో పాటు నమూనా చిత్రాలను పంచుకుంది. వాటిలో ట్రంప్ ఫొటోతో పాటు బంగారు రంగులో ఆయన సంతకం కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ డిజైన్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా పాస్‌పోర్టులపై చారిత్రక దృశ్యాలు, జాతీయ గుర్తింపులు మాత్రమే ముద్రించడం ఆనవాయితీ.
అయితే అధికారంలో ఉన్న నాయకుడి ఫొటోను పాస్‌పోర్టుపై ముద్రించడం అరుదైన పరిణామంగా భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా పాస్‌పోర్టులపై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వంటి చారిత్రక చిహ్నాలు ఉంటాయి.
ఇక స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ట్రంప్ ముఖచిత్రంతో స్మారక నాణేలు, ఆయన సంతకం ఉన్న కరెన్సీ నోట్లు విడుదల చేసే ప్రణాళికలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ చర్యలతో అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చలు మరింత ముదురుతున్నాయి.








