CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి, ఒక్కో ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించారు. అంతేకాదు.. రాబోయే రెండు దశాబ్దాల్లో తెలంగాణ ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే లక్ష్యంతో భారీ కార్యాచరణను ప్రకటించారు. తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 85వ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలని సంకల్పించినట్లు తెలిపారు. కేంద్రం నిర్దేశించుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో తెలంగాణ కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణను ‘క్యూర్, ప్యూర్, రేర్’ పేర్లతో మూడు ప్రాంతాలుగా విభజించినట్లు సీఎం వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిని ‘క్యూర్’గా గుర్తించి సేవారంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని ‘ప్యూర్’గా అభివృద్ధి చేస్తూ తయారీ పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ఆర్ఆర్ఆర్ వెలుపలి ప్రాంతాన్ని ‘రేర్’గా పరిగణించి వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పనలో రోడ్లు, భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న నూతన ఉస్మానియా ఆసుపత్రి, టిమ్స్ సహా ఇతర ఆసుపత్రుల ద్వారా మొత్తం 8 వేల పడకలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
అభివృద్ధి, జాతీయ ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించిన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇక పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సదస్సు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడంలో కీలకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తంగా మూడు ప్రాంతాలు.. మూడు ప్రత్యేక అభివృద్ధి వ్యూహాలు.. రెండు భారీ ఆర్థిక లక్ష్యాలతో తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ లక్ష్యాలను నిర్దేశిత గడువులో సాధించడం ఇప్పుడు ప్రభుత్వానికి అసలైన సవాలుగా మారనుంది.
ALSO READ: Anti Drug Campaign India | డ్రగ్స్‌పై పోరాటానికి నా మద్దతు ఎప్పుడు ఉంటుంది: అక్కినేని నాగార్జున
