LIVE
Thursday, November 19, 2026
LIVE
LIVE

Supreme Court | రెండో పెళ్లి పిల్లలకూ తల్లి ఆస్తిలో హక్కు ఉంటుంది.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

by Bajaswamy
5 views
supreme court

Supreme Court: కుటుంబ ఆస్తుల పంపకాల్లో వారసత్వ హక్కులపై తరచూ వివాదాలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా మహిళ రెండో వివాహం చేసుకున్న సందర్భాల్లో మొదటి భర్త కుటుంబం నుంచి వచ్చిన ఆస్తిపై ఆమె పిల్లలకు హక్కులు ఉంటాయా? అనే సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ఇలాంటి వివాదానికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక స్పష్టత ఇచ్చింది. రెండో వివాహం ద్వారా జన్మించిన పిల్లలకు కూడా తల్లి సొంత ఆస్తిపై వారసత్వ హక్కు ఉంటుందని తీర్పునిచ్చింది. ఢిల్లీలోని సుమారు 45 బిగాల వ్యవసాయ భూమికి సంబంధించిన వారసత్వ వివాదంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది. ఖజానో అనే మహిళకు మొదటి భర్త మౌజీ రామ్, వారి కుమారుడు రామ్ చందర్ మరణించిన అనంతరం ఈ భూమి సంక్రమించింది. అనంతరం ఖజానో బాల్‌కిషన్‌ను వివాహం చేసుకోగా, వారికి చంద్ రామ్, చందర్ భాన్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు.

అయితే ఖజానో మరణించిన తర్వాత భూమి వారసత్వంపై వివాదం మొదలైంది. ఈ ఆస్తి తమ పూర్వీకుల నుంచి వచ్చినదని మొదటి భర్త కుటుంబ సభ్యులు వాదించారు. రెండో వివాహం ద్వారా జన్మించిన కుమారులకు ఆ భూమిపై హక్కులు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి విరుద్ధంగా, తమ తల్లి ఆస్తిలో తమకూ సమానంగా చట్టబద్ధమైన వారసత్వ హక్కులు ఉన్నాయని ఆమె రెండో వివాహం ద్వారా జన్మించిన కుమారులు వాదించారు. ఈ వ్యవహారంపై ‘సుల్తాన్ సింగ్ వర్సెస్ ఫైనాన్షియల్ కమిషనర్’ కేసులో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. హిందూ వారసత్వ చట్టం-1956లోని సెక్షన్ 14(1)ను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. చట్టం అమల్లోకి రాకముందే ఖజానో ఆ భూమిపై హక్కులు కలిగి ఉండటంతో, అప్పటివరకు ఉన్న పరిమిత హక్కులు పూర్తిస్థాయి యాజమాన్య హక్కులుగా మారాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఢిల్లీ భూ సంస్కరణల చట్టం-1954 నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఖజానో మరణించే సమయానికి అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఆమెకు చట్టబద్ధ వారసులైన చంద్ రామ్, చందర్ భాన్‌లకు ఆస్తి చెందుతుందని తేల్చిచెప్పింది. ఈ తీర్పుతో ఆస్తి మొదట ఏ కుటుంబం నుంచి వచ్చిందన్న అంశం కంటే, మహిళకు ఆ ఆస్తిపై ఉన్న యాజమాన్య హక్కులే వారసత్వ నిర్ణయంలో కీలకమని స్పష్టమైంది. మొత్తానికి, మహిళకు సంపూర్ణ యాజమాన్య హక్కులు ఉన్న ఆస్తిపై ఆమె రెండో వివాహం ద్వారా జన్మించిన పిల్లలకూ వారసత్వ హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కుటుంబ ఆస్తుల వివాదాల్లో కీలక ప్రాధాన్యత సంతరించుకుంది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More