Ponguleti Srinivasa Reddy: విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యం, క్రీడారంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వృత్తి విద్య, సాంకేతిక కోర్సులకు మరింత ప్రోత్సాహం అందించే దిశగా కీలక చర్యలు చేపడుతోంది. ఈ విషయాలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా కల్లూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ నీటి శుద్ధి ప్లాంటును మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ దివకర టీఎస్, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన బోధన, మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రపంచ క్రీడా వేదికలపై తెలంగాణ క్రీడాకారులు దేశానికి గర్వకారణంగా నిలవాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు పెంచే ఉద్దేశంతో ఐటీఐ, వృత్తి విద్య, సాంకేతిక కోర్సులను బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు. టాటా సంస్థ భాగస్వామ్యంతో రూ.25 కోట్ల వ్యయంతో ప్రతి నియోజకవర్గంలో ఒక యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దీని ద్వారా విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి అవసరమైన శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహార సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మెస్ ఛార్జీలను 100 శాతం, కాస్మోటిక్ ఛార్జీలను 218 శాతం పెంచినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మోహన్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆధునిక సాంకేతిక శిక్షణ, క్రీడా అవకాశాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
