Randhir Jaiswal Statement: అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిన అజిత్ దోవల్‌పై అమెరికా కోర్టు సమన్ల వ్యవహారంలో భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు పంపించినట్లు పేర్కొన్న సమన్లను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ వ్యవహారంలో చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమైనవని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి నిరాధార వ్యాజ్యాలను భారత్ ఏమాత్రం పట్టించుకోదని స్పష్టం చేశారు. భారత అధికారులకు అధికారికంగా సమన్లు పంపించాలంటే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారానే చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని వెల్లడించారు.
ఖలీస్థాన్ ఉగ్రవాదిగా భారత్ గుర్తించిన గురుపత్వంత్ సింగ్ పన్నూన్ 2024 సెప్టెంబర్‌లో అమెరికా కోర్టును ఆశ్రయించాడు. తన హత్యకు అజిత్ దోవల్, రా మాజీ చీఫ్ సామంత్ గోయల్ కుట్ర పన్నారంటూ ఆరోపించాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి వారిద్దరికీ సమన్లు జారీ చేయాలని ఆదేశించారు. అయితే ఈ పరిణామాలపై భారత్ తాజాగా మరోసారి స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. నిరాధార ఆరోపణలకు తలొగ్గే ప్రసక్తే లేదని సంకేతాలిచ్చింది. ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య ఎలాంటి దౌత్యపరమైన పరిణామాలకు దారితీస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ALSO READ: Ram Pothineni New Movie | రామ్ పోతినేని న్యూ లుక్ వెనుక అసలు కథ ఇదే
