Akash Deep wickets: మ్యాచ్ ఏ దశలో ఉన్నా సరే.. ప్రత్యర్థి జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నా వెనక్కి తగ్గకుండా పోరాడటమే నిజమైన ఆటగాడి లక్షణం. న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా పేసర్ ఆకాష్‌దీప్ అలాంటి పోరాట పటిమనే ప్రదర్శించాడు. భారీ భాగస్వామ్యంతో దూసుకెళ్తున్న కివీస్ బ్యాటర్లకు కీలక సమయంలో షాకిచ్చి భారత జట్టుకు ఊరటనిచ్చాడు. వెల్లింగ్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆకాష్‌దీప్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 23 ఓవర్లు వేసిన అతడు ఏడు మెయిడిన్లతో 53 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా సాగుతున్న సమయంలో అతడి బౌలింగ్ భారత జట్టుకు కీలకంగా మారింది. ఒక దశలో 318 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన కివీస్ పటిష్ట స్థితిలో కనిపించింది. హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ కలిసి ఆరో వికెట్‌కు ఏకంగా 216 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నికోల్స్ 175 పరుగులతో, ఫిలిప్స్ 118 పరుగులతో శతకాలు సాధించి భారత బౌలర్లను ఇబ్బంది పెట్టారు.
అయితే ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయడంలో ఆకాష్‌దీప్ కీలక పాత్ర పోషించాడు. సెంచరీ పూర్తి చేసుకున్న కొద్దిసేపటికే గ్లెన్ ఫిలిప్స్‌ను పెవిలియన్‌కు పంపి భారత్‌కు పెద్ద ఊరటనిచ్చాడు. ఆ వికెట్‌తో న్యూజిలాండ్ పతనం మొదలైంది. చివరి నాలుగు వికెట్లను కేవలం 50 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. చివరకు కైల్ జేమీసన్‌ను ఔట్ చేయడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 368 పరుగుల వద్ద ముగిసింది. మరోవైపు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఆకాష్‌దీప్ మాత్రం తన కచ్చితమైన బౌలింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక అతడి టెస్టు గణాంకాలను పరిశీలిస్తే.. 11 మ్యాచ్‌ల్లో 31 వికెట్లు సాధించాడు. 34.03 బౌలింగ్ సగటుతో కొనసాగుతున్నాడు. ఇందులో ఒకసారి నాలుగు వికెట్లు, మరోసారి ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి SENA దేశాల్లో 21 టెస్టు వికెట్లు పడగొట్టడం మరో విశేషం. అక్కడ అతడి బౌలింగ్ సగటు 37.95గా ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనూ ఆకాష్‌దీప్ మంచి రికార్డును కొనసాగిస్తున్నాడు. 54 మ్యాచ్‌ల్లో 184 వికెట్లు సాధించి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.. ప్రసుతం భారత జట్టు స్కోర్ 151/1.. జైశ్వాల్ 85 పరుగులకు వెనుదిరగగా , క్రిజులో ఉన్న కేఎల్ రాహుల్ 52 పరుగులు, పడికల్ 15 పైన బ్యాట్టింగ్ చేస్తున్నారు. మొత్తంగా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలుస్తున్న ఆకాష్‌దీప్.. భారత టెస్టు పేస్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్నాడు. రానున్న మ్యాచ్‌ల్లోనూ ఇదే స్థాయి ప్రదర్శన కొనసాగిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
ALSO READ: Vietnam Rescue Video | రెప్పపాటులో ప్రాణాలు కాపాడాడు.. ఈ వ్యక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
