Ponnam Prabhakar: సభకు వచ్చి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లాల్సిన ఓ మహిళ.. అనూహ్య ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించింది. సిద్దిపేటలో నిర్వహించిన సభ అనంతరం బస్సు కోసం వెళ్తున్న సమయంలో హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ (55) ప్రమాదానికి గురై మృతి చెందారు. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి చేరుకున్న ఆయన.. జిల్లా కలెక్టర్ హైమవతితో కలిసి సారవ్వ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. సారవ్వ మహిళా సంఘంలో సభ్యురాలు కావడంతో, ఆమె కుటుంబానికి మహిళా సంఘం ద్వారా వర్తించే రూ.10 లక్షల ప్రమాద బీమా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబానికి ఎదురైన ఈ తీరని నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయినా, ఆపద సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.
ALSO READ: Akash Deep wickets | కివీస్ దూకుడుకు బ్రేక్.. ఒక్క వికెట్‌తో మ్యాచ్ స్వరూపమే మార్చేశాడు
