పెద్ది(Peddi) సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా జపాన్‌లో రామ్ చరణ్ కు పెరుగుతున్న క్రేజ్ కారణంగా ఈ సినిమాపై అక్కడి ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే RRR సినిమాతో జపాన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న రామ్ చరణ్, తర్వాత రంగస్థలం సినిమాతో అక్కడ మంచి గుర్తింపు పొందాడు. ఈ రెండు సినిమా విజయాల తర్వాత ఇప్పుడు ‘పెద్ది’ సినిమాపై జపాన్ మార్కెట్ దృష్టి పడింది.
ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే తేదీనే జపాన్‌లో కూడా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. జపాన్ విడుదల హక్కులను ప్రముఖ సంస్థ ఇండ్డేగా(INDDEIGA) సొంతం చేసుకుంది. భారీ స్థాయిలో థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు ఆ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
టాలీవుడ్ చిత్రాలకు జపాన్‌లో ప్రత్యేక మార్కెట్ ఏర్పడుతున్న నేపథ్యంలో ‘పెద్ది’కి కూడా మంచి స్పందన లభించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్‌కు అక్కడ విశేషమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దీంతో ‘పెద్ది’ చిత్రానికి మంచి టాక్ వస్తే జపాన్ బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్నారు. ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నడు, ఈ చిత్రాన్ని గ్రామీణ భావోద్వేగాలు, భారీ యాక్షన్ అంశాలతో రూపొందిస్తున్నట్లు సమాచారం. చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆస్కార్ విజేత A. R. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, ఇప్పుడు జపాన్ విడుదల వార్తతో సినిమా హైప్ మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
ALSO READ:భవిష్యత్ టూరింగ్ బైక్‌కు కొత్త నిర్వచనం.. BMW Vision K18 ఆవిష్కరణ, అదిరిపోయిన లుక్








