Rajnath Singh: రక్షణ రంగానికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మేధావులతో సమావేశాలు, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించే ప్రత్యేక పరేడ్ వంటి పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఇప్పటికే విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న రాజ్‌నాథ్ సింగ్‌కు రాష్ట్ర బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమై దేశ అభివృద్ధి, సమకాలీన అంశాలపై చర్చించనున్నారు.
తరువాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్‌డీఎల్)ను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక ‘కుషా కాంప్లెక్స్’ను ప్రారంభించనున్నారు. అలాగే అత్యాధునిక పరిశోధన కేంద్రాలను పరిశీలించి శాస్త్రవేత్తలతో ముచ్చటించనున్నారు. సాయంత్రం నిర్వహించే మేధావుల సమావేశంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై అభిప్రాయాలను పంచుకోనున్నారు.
అనంతరం దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చేరుకుని శిక్షణ పొందుతున్న క్యాడెట్లు, అధికారులతో సమావేశమవుతారు. ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేయడంతో పాటు అకాడమీలోనే బస చేయనున్నారు.
శనివారం ఉదయం ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కొత్తగా భారత వాయుసేనలో చేరనున్న క్యాడెట్ల పరేడ్‌ను సమీక్షించి వారికి ప్రోత్సాహక సందేశం ఇవ్వనున్నారు. కార్యక్రమం అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు.
Rajnath Singh | నేడు హైదరాబాద్‌కు రానున్న రాజ్‌నాథ్ సింగ్.. గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా
-








