Bhatti Vikramarka: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధిర ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కిచెన్‌ను ఆయన ప్రారంభించారు. హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు అందించనున్న అల్పాహార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విక్రమార్క మాట్లాడుతూ.. విద్యార్థుల చదువుకు ఆకలి అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో అల్పాహార పథకాన్ని తీసుకొచ్చామని అన్నారు.
రాష్ట్రంలోని 26 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం ఆహారం అందిస్తున్నామని తెలిపారు. పౌష్టికాహారం అందించడం ద్వారా చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, విద్యపై వారి ఆసక్తి, ఏకాగ్రతను పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని వివరించారు. అల్పాహార పథకం ప్రారంభ సమయంలో పలువురు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, ప్రభుత్వం దానిని విజయవంతంగా అమలు చేస్తోందని భట్టి పేర్కొన్నారు. త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించే ప్రణాళిక ఉందన్నారు. మరో మూడు నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.








