Raghav Chadha: పార్లమెంట్‌లో సామాన్యుల తరఫున ప్రశ్నలు లేవనెత్తి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తాజాగా రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశమయ్యారు. ఇటీవల ఆయన ఆప్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతను అప్పగించింది.
తాజాగా రాఘవ్ చద్దాను రాజ్యసభ పిటిషన్ల కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. కమిటీని పునర్‌వ్యవస్థీకరించిన అనంతరం మొత్తం 10 మంది సభ్యులను నామినేట్ చేయగా, చద్దాను చైర్మన్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం మే 20 నుంచి అమల్లోకి వచ్చినట్లు సమాచారం.
ఈ కమిటీలో హర్ష్ మహాజన్, గులాం అలీ, శంభు శరణ్ పటేల్, మయంకుమార్ నాయక్, బీదా మస్తాన్ రావు యాదవ్, జెబి మాథర్ హిషాం, సుభాసిష్ ఖుంటియా, ర్వంగ్వ్రా నార్జరీ, పి. సంతోష్ కుమార్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.
ఇక ఏప్రిల్ 26న రాఘవ్ చద్దా తనతో పాటు మరో ఆరుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలతో కలిసి పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆప్ తన మూల సిద్ధాంతాలు, విలువలకు దూరమైందని ఆయన ఆరోపించారు. అవినీతి వ్యతిరేక పోరాటంతో ప్రారంభమైన పార్టీ ఇప్పుడు అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లిందని విమర్శించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనకు ఇచ్చిన తాజా బాధ్యతపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో కూడా “పార్టీ మార్పుకు గిఫ్ట్‌గా పదవి” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.








