తంబళ్లపల్లి మండలంలోని మూడు రోడ్ల కూడలిలో చెట్లవారిపల్లి గ్రామస్తులు, నవీన్ కుమార్ (24) మృతిపై దర్ణా చేపట్టారు. పుడమి కిసాన్ మార్ట్‌లో అకౌంటెంట్‌గా పని చేసిన నవీన్ కుమార్, 23 లక్షల లెక్కల తేడా వచ్చిందంటూ యాజమాన్యం అనవసరంగా తనపై నిందలు మోపిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
గత రాత్రి నవీన్ కుమార్ దుకాణం తెరిచి, వెనుక మెట్ల వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న తంబళ్లపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పంచనామ నిర్వహించి మృతదేహాన్ని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. తండ్రి వీరభద్ర ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగిస్తున్నారు.
నవీన్ కుమార్ అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగిగా స్థిరపడిన యువకుడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, తమ బిడ్డకు న్యాయం చేయాలని తంబళ్లపల్లి కూడలిలో ధర్నా చేపట్టారు.
ఉదయం 11 గంటల నుంచి ఎండను లెక్కచేయకుండా గ్రామస్తులు, బంధువులు నిరసనకు దిగారు. కిసాన్ మార్ట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరుతున్నారు.