వెంకటాచలం మండలం గొలగమూడి లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు కీలక సూచనలు చేశారు. కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువకు ధాన్యం అమ్మొద్దని, దళారుల మాయలో పడకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని పిలుపునిచ్చారు. పుట్టికి ₹19,720 చెల్లిస్తున్న ప్రభుత్వాన్ని నమ్మి ధాన్యం అమ్మాలన్నారు.
సోమిరెడ్డి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సులభతరం చేశామని, రైతులకు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా ట్యాగ్ చేసిన రైస్ మిల్లులకు ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రస్తుతం ఆర్ఎన్ఆర్ రకం పంటలకు మంచి ధర లభిస్తోందని, కేఎన్ఎం, బీపీటీ రైతులు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. బ్యాంక్ గ్యారెంటీ రేషియోను 1:1 నుండి 1:2కు పెంచి అధికంగా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
ప్రస్తుతం రైతులు ధాన్యం తేమ శాతాన్ని తగ్గించేందుకు వాతావరణాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. తేమ శాతం 17% లోపులో ఉంటే పూర్తిగా కొనుగోలు చేస్తామని, 17% పైగా ఉంటే ప్రతి శాతానికి క్వింటాలుకు కేవలం 8.5 కిలోల తగ్గింపు మాత్రమే ఉంటుందని తెలిపారు. పుట్టికి 900, 950 కిలోలివ్వాల్సిన అవసరం లేదని, దళారులు, రైస్ మిల్లర్లు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తన కార్యాలయాన్ని సంప్రదించాలని సోమిరెడ్డి సూచించారు. ధాన్యం అమ్మకంలో సహాయం చేయడానికి అధికారుల్ని అందుబాటులో ఉంచామని, 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని హామీ ఇచ్చారు.