కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి MRPS నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదిగ మహిళలు, MRPS నేతలు స్వీట్స్ పంచిపెట్టారు.
ఈ సందర్భంగా MRPS నాయకులు రాజ్ కుమార్ ప్రకాష్ మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాదిగలు 30 ఏళ్లుగా పోరాడుతున్నారని, తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం MRPS విజయంగా భావిస్తున్నామని అన్నారు. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
MRPS నేతలు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అంగీకారం తెలిపిన మొదటి రాష్ట్రంగా నిలిచిందని, తద్వారా మాదిగలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరించి, సామాజిక సమానత్వం కోసం ప్రభుత్వం మరిన్ని అడుగులు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు పాపన్న మాదిగ, సీనియర్ నాయకులు వెంకటేష్ మాదిగ, సుబ్రహ్మణ్యం మాదిగ, మహాజన సోషలిస్టు పార్టీ రామకుప్పం మండల అధ్యక్షుడు గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు.