ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ క్యాంపు కార్యాలయంలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించగా, పలువురు తమ సమస్యలను ఆయనకు వివరించారు. పాలకుర్తి మండలానికి చెందిన రవి అనే యువకుడు తన తండ్రి కేశోరం సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తూ మరణించాడని, తనకు ఉద్యోగం కల్పించాలని కోరాడు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, ఫ్యాక్టరీ మేనేజర్‌ను ఫోన్ ద్వారా సంప్రదించి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరగా, వారు సానుకూలంగా స్పందించారు.
కన్నాల గ్రామానికి చెందిన నిరుద్యోగులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌ను కలవగా, వారికి స్థానిక మెడికల్ కళాశాలలో ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఆత్మవిశ్వాసం కల్పించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నూతనంగా వివాహం జరిగిన కుటుంబాలకు కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ పథకాలలోని ఫైల్స్‌ను పరిశీలించి, వాటిపై సంతకాలు చేశారు. ఈ పథకాల ద్వారా ప్రభుత్వం పెళ్లైన యువతులకు ఆర్థిక భరోసా అందిస్తోందని తెలిపారు. పెళ్లైన దంపతులు ఈ సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.
నిరుపేద కుటుంబానికి చెందిన ఒకరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆరోగ్యశ్రీ కార్డు లేనందున చికిత్స ఖర్చులు భరించలేకపోతున్నారని ఎమ్మెల్యేకు తెలిపారు. వెంటనే రామగుండం ఎమ్మార్వో కార్యాలయాన్ని సంప్రదించి, వారికి BPL కార్డు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.