Commonwealth Games: 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్స్ మరోసారి తమ అద్భుత ప్రతిభతో దేశానికి గర్వకారణంగా నిలిచారు. గ్లాస్గోలో ముగిసిన ఈ క్రీడల్లో భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక మాధ్యమం X ద్వారా స్పందిస్తూ భారత అథ్లెట్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. క్రీడాకారులు అసాధారణ ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావంతో దేశ గౌరవాన్ని పెంచారని కొనియాడారు. వారి విజయం దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
11 రోజుల పాటు ఉత్కంఠగా సాగిన కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ బాధ్యతలను భారత్ అధికారికంగా స్వీకరించింది. శతాబ్ది సంచికకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుండగా, కామన్వెల్త్ గేమ్స్‌ను రెండోసారి నిర్వహించే దేశంగా భారత్ నిలవనుంది. ముగింపు వేడుకల్లో కామన్వెల్త్ జెండా, అధికారిక బ్యాటన్‌ను నీరజ్ చోప్రా, పీటీ ఉషా, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి స్వీకరించారు. ఈ గేమ్స్‌లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ రెండు పతకాలు గెలిచి ప్రత్యేక గుర్తింపు పొందగా, తక్కువ సంఖ్యలో అథ్లెట్లతో బరిలోకి దిగినా భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చడం విశేషంగా నిలిచింది.








