Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. తాజాగా ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒకేసారి రెండు సభల్లో సభ్యత్వం కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నియమాల ప్రకారం 14 రోజుల లోపు ఒక పదవిని వదులుకోవాల్సి ఉండగా, గడువు ముగియకముందే ఆయన ఎమ్మెల్సీ స్థానాన్ని వీడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా సమాచారం ప్రకారం, నితీశ్ కుమార్ ఏప్రిల్ 9న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై మళ్లీ చర్చ మొదలైంది.
ఇప్పటివరకు పది సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నితీశ్ కుమార్ రాజకీయ ప్రయాణాన్ని విశ్లేషకులు “కూటమి రాజకీయాల్లో మాస్టర్ క్లాస్”గా అభివర్ణిస్తున్నారు.
1985లో ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన, అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా సేవలందించారు.
2005లో తొలిసారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితీశ్, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు. అయితే 2013 తర్వాత ఆయన రాజకీయ ప్రయాణం వరుస కూటమి మార్పులతో ప్రత్యేక మలుపులు తిరిగింది.
భారతీయ జనతా పార్టీ కూటమి, మహాఘటబంధన్‌లోని ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య ఆయన అనేకసార్లు మద్దతు మార్చుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2013, 2017, 2022, 2024 సంవత్సరాల్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఆయన రాజకీయ వ్యూహాలకు నిదర్శనంగా నిలిచాయి.
ప్రస్తుతం కూడా నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేకపోవడం ఆసక్తిని పెంచుతోంది. ఆయన తాజా నిర్ణయం బీహార్ రాజకీయాల్లో మరిన్ని కీలక మార్పులకు దారితీయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.








