Vande Bharat Express: ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త అందనుంది. రాష్ట్రంలో వేగవంతమైన రైలు ప్రయాణానికి మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విశాఖపట్నం నుంచి తిరుపతికి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు ఎంపీలు చేసిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ ప్రతిపాదన ముందుకు సాగినట్లు సమాచారం.
కొత్త రైలు రాకతో ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర మీదుగా తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే రూట్, స్టాపింగ్‌లు, రైలు వేళలకు సంబంధించి రైల్వే అధికారులు ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే తుది షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ఈ రైలు విశాఖపట్నంలో ఉదయం 5:35 గంటలకు బయలుదేరి సామర్లకోటకు 7 గంటలకు, రాజమండ్రికి 7:40 గంటలకు, విజయవాడకు 9:30 గంటలకు చేరుకుంటుంది. అనంతరం ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతూ మధ్యాహ్నం 2:10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:55 గంటలకు తిరుపతిలో బయలుదేరి నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట మీదుగా రాత్రి 11:30 గంటలకు విశాఖపట్నం చేరుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీలో నాలుగు వందేభారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి. విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు రెండు, భువనేశ్వర్‌కు ఒకటి, దుర్గ్‌కు మరొకటి నడుస్తున్నాయి. మరోవైపు విశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు రాత్రి వేళల్లో వందేభారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి, విశాఖ–తిరుపతి వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే ఏపీలో రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. అధికారిక ప్రకటన, తుది సమయాల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.
ALSO READ: Cheyutha Pension | కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు.. 4.63 లక్షల మందికి కొత్త పెన్షన్లు
