RE-NEET Exam: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. నాసిక్ కేంద్రంగా పనిచేసిన ఓ నెట్వర్క్ను అధికారులు గుర్తించగా, దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ ముఠాపై వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఈ పరిణామాలతో విద్యా వ్యవస్థలో తీవ్ర కలకలం రేగింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రీ-నీట్ (NEET UG) పరీక్ష నిర్వహణపై దృష్టి సారించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పరీక్ష నిర్వహణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో గుర్తించిన లోపాలను పూర్తిగా సరిదిద్దాలని, పారదర్శకతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
రీ-నీట్ పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు బలమైన భద్రతా ప్రోటోకాల్ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రాల స్థాయిలో జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లతో సమన్వయం చేసి పరీక్షా ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచించారు.
పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘా, కఠిన తనిఖీలు, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే విద్యార్థులకు రవాణా, తాగునీరు, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కూడా సూచించారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పరీక్షల పవిత్రతను కాపాడేందుకు ఎటువంటి రాజీ ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.








