ఏపీలో ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు అందించేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో వెయ్యి మినీ మార్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వెల్లడించారు.
ఈ మేరకు ఆయన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు అందించేందుకు ఈ మినీ మార్టులు ఉపయోగపడతాయని తెలిపారు. సిరిధాన్యాలు సహా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే ఏపీలో ప్రసిద్ధి చెందిన అరకు కాఫీకి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని అన్ని సైనిక శిబిరాల్లో అరకు కాఫీ విక్రయాలు జరిగేలా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపినట్లు ఆయన వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా రైతులు, ఉత్పత్తిదారులు, వినియోగదారులు అందరికీ లాభం కలిగేలా వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది.








