ఖానాపూర్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో NSUI నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గోదావరి నీటి సమస్యపై BRS నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, అసలు సమస్య మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడమేనని NSUI జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయ్ రాజ్ తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ప్రణాళికను, ప్రత్యేక రాష్ట్రం తర్వాత BRS ప్రభుత్వం రీడిజైన్ పేరుతో నాణ్యతా లోపాలతో మేడిగడ్డ బ్యారేజీగా మార్చిందని ఆరోపించారు. NDSA, CWC, CAG నివేదికల ప్రకారం ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, వాటిని మూసివేయడానికి BRS నాయకులు ‘గోదావరి గోస’ యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందించాల్సిన నీటి పరిమాణం ఆశించిన స్థాయికి చేరుకోలేదని NSUI నేతలు పేర్కొన్నారు. CAG నివేదిక ప్రకారం, ప్రాజెక్టు ద్వారా 18.26 లక్షల ఎకరాలకు నీరు అందించాల్సిన మార్గం ఉన్నప్పటికీ, 2022 నాటికి కేవలం 40,888 ఎకరాలకు మాత్రమే నీరు చేరిందని ఆరోపించారు. అంతేగాక, ప్రాజెక్ట్ పనులు ఇంకా పూర్తికావాల్సి ఉండగా, ఖర్చు భారీగా పెరిగిందని వివరించారు.
NSUI నేతలు తక్షణమే ప్రాజెక్టుపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయకుండా, గోదావరి నీటి సమస్యకు పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.