PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ రైతాంగానికి ఊరటనిచ్చే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పంటల కనీస మద్దతు ధర (MSP) పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా పంట ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50 శాతం లాభం కలిపి కొత్త ధరలను నిర్ణయించారు.
ఈ నిర్ణయం ప్రకారం సాధారణ వరి రకం కనీస మద్దతు ధరను రూ.2,441గా, నాణ్యమైన గ్రేడ్-ఏ వరి ధరను రూ.2,461గా ఖరారు చేశారు. ఖరీఫ్ పంటల మద్దతు కోసం ప్రభుత్వం మొత్తం రూ.2.6 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఈ నిర్ణయం రైతాంగానికి ఆర్థిక భరోసా ఇవ్వనుందని కేంద్రం పేర్కొంది.
వ్యవసాయ రంగంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా కేబినెట్ దృష్టి సారించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రవాణా, వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కానుంది.
అలాగే దేశ ఇంధన రంగంలో స్వావలంబన లక్ష్యంగా కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి రూ.37,500 కోట్ల నిధులను కేటాయించారు. దీనివల్ల దిగుమతి ఇంధనంపై ఆధారపడటం తగ్గనుంది. సర్కేజీ–ధోలేరా మధ్య సెమీ హైస్పీడ్ డబుల్ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.20,065 కోట్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక, రవాణా, ఇంధన రంగాల్లో కీలక మార్పులు తీసుకురానున్నాయి.








