బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. జనసేన బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జనసేన రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ, మార్చి 14న పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుందని తెలిపారు. బాపట్ల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తరలి వెళ్లాలని, ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం కీలకమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మాట్లాడుతూ, గతంలో జనసేన ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించిందని గుర్తు చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇప్పటం సభకు స్థలాలు ఇచ్చిన రైతులను వేధించిందని, కానీ ఇప్పుడు ఈ సభ విజయోత్సవ సభగా మారుతుందని వ్యాఖ్యానించారు.
డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. పిఠాపురంలో జరిగే సభకు భారీగా తరలివచ్చి జనసేన బలాన్ని చాటాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.