Mallareddy: విద్యా రంగాన్ని మరింత శక్తివంతం చేయాలనే లక్ష్యంతో మేడ్చల్‌లో నియోజకవర్గంలో మల్లారెడ్డి ముందడుగు వేశారు. స్థానిక విద్యార్థులకు అధునాతన కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కొత్త విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. మేడ్చల్, శామీర్‌పేట ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ మరియు మల్లారెడ్డి పాఠశాల బ్రాంచ్‌లను ఆయన ఘనంగా ప్రారంభించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మల్లారెడ్డి సందడి చేశారు. విద్యార్థులతో సరదాగా క్రికెట్ ఆడుతూ ఆ వాతావరణంలో ఉత్సాహాన్ని నింపారు. ఆయన ఉత్సాహంతో పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక మెరుగు తీసుకొచ్చింది.
అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మేడ్చల్ ప్రజలు తనను వరుసగా మూడుసార్లు గెలిపించారని గుర్తుచేశారు. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి విద్యా రంగంలో పెద్దఎత్తున సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక సీఎంఆర్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తక్కువ ఫీజులతో నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందించడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని విద్యా సంస్థలను ప్రారంభించి విద్యను ప్రతి విద్యార్థికి చేరువ చేయడమే తమ ఆశయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్‌పర్సన్లు శ్రీదేవి, శిరీష, మున్సిపల్ చైర్మన్ జామూ రవి, మాజీ లైబ్రరీ చైర్మన్ భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.








