ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ప్రక్షాళన చర్యలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో 264 మంది పోలీస్ సిబ్బందిని మారుస్తూ డీజీపీ గుప్తా నిర్ణయం తీసుకోగా, తాజాగా అన్నమయ్య జిల్లాలో మరో 364 మంది బదిలీ అయ్యారు. వీరిలో 41 మంది ఏఎస్సైలు, 123 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 200 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.
ఈ బదిలీలకు ప్రధాన కారణంగా, కొంతమంది పోలీసులు ప్రతిపక్ష నేతలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. అరాచక శక్తులను సహించబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీ గుప్తాకు ఆదేశించారు.
ప్రత్యేకంగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాబల్యం ఉన్న పోలీస్ స్టేషన్‌లో మొత్తం 42 మంది పోలీసులను బదిలీ చేసి కొత్త సిబ్బందిని నియమించారు. అంతేకాదు, రాయలసీమ, గుంటూరు, పల్నాడు, కృష్ణా, విజయవాడ వంటి ప్రాంతాల్లోనూ ఇలాంటి చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ప్రభుత్వం నేరస్తులపై దృష్టి సారించింది. వారి అక్రమ ఆస్తులు, భూ కబ్జాలు, బెదిరింపులు, రౌడీషీట్లు, కేసుల దర్యాప్తు స్థితి వంటి వివరాలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేకరిస్తోంది. పోలీస్ శాఖను మరింత పారదర్శకంగా, న్యాయంగా నడిపించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.