Lenskart Controversy: ప్రముఖ కళ్లజోళ్ల సంస్థ లెన్స్‌కార్ట్ తాజాగా వివాదం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగులు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఉండగా, హిందూ సంప్రదాయానికి చెందిన బొట్టు, తిలకం ధరించవద్దని సంస్థ సూచించిందన్న ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం తీవ్ర చర్చకు దారి తీసింది.
ఈ వార్తలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేయగా, ముంబైలోని ఒక లెన్స్‌కార్ట్ స్టోర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీకి చెందిన ముస్లిం నాయకురాలు నజియా ఇలాహి ఖాన్ (Nazia Elahi Khan) తన అనుచరులతో కలిసి స్టోర్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. అక్కడి సిబ్బందికి స్వయంగా తిలకం పెట్టి, చేతికి కాశీ దారాలు కట్టి“జై శ్రీరామ్” నినాదాలు చేశారు.
అసలు వివాదం ఏమిటి?
ఉద్యోగులకు ట్రైనింగ్ సమయంలో తిలకం, దారాలు, మంగళసూత్రం వంటి సంప్రదాయ చిహ్నాలు ధరించవద్దని చెప్పారనే ఆరోపణలు బయటకు వచ్చాయి. దీనిపై ఉద్యోగులే ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం మరింత పెద్దదైంది.“హిజాబ్‌కు అనుమతి ఉంటే, ఇతర మత చిహ్నాలపై ఆంక్షలు ఎందుకు?” అనే ప్రశ్నలు వినిపించాయి.
స్టోర్ వద్ద నిరసనలు
నాజియా ఇలాహీ ఖాన్ స్టోర్ మేనేజ్‌మెంట్‌ను నిలదీస్తూ, హిందూ చిహ్నాలపై ఆంక్షలు విధించడం సరైంది కాదని అన్నారు. యాజమాన్యం క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా లెన్స్‌కార్ట్ షోరూమ్‌లపై ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కంపెనీ స్పందన
వివాదం ముదురడంతో పేయుశ్ బన్సల్ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన డాక్యుమెంట్ పాతదని, ప్రస్తుతం అమల్లో లేదని స్పష్టం చేశారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగులు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా బొట్టు, తిలకం, హిజాబ్, తలపాగా వంటి వాటిని ధరించవచ్చని తెలిపారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశ్యం కాదని కంపెనీ పేర్కొంది.
వివాదం నుంచి తీసుకోవాల్సిన పాఠం
ఈ ఘటన కార్యాలయాల్లో మతపరమైన స్వేచ్ఛ, సమానత్వంపై మరోసారి చర్చకు దారి తీసింది. ఉద్యోగుల వ్యక్తిగత విశ్వాసాలను గౌరవించడం సంస్థల బాధ్యతగా నిపుణులు సూచిస్తున్నారు.








