అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి శ్రీమతి చింతకాయల పద్మావతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళుతున్నారు. విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాల్లో మహిళలు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కృషి, పట్టుదలతో ముందుకు సాగితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు. విద్యార్థినులు తమ భవిష్యత్తు కోసం కృషి చేయాలి” అని సూచించారు. లింగ సమానత్వం కోసం అందరూ కృషి చేయాలని, మహిళలు అన్ని హక్కులు పొందేలా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
నర్సీపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీమతి రేవతమ్మ మాట్లాడుతూ, “పని ప్రదేశాల్లో మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. స్వీయరక్షణకు సంబంధించి అవగాహన పెంచుకోవాలి” అని విద్యార్థినులకు సూచించారు. మహిళల భద్రత కోసం పోలీసులు అందుబాటులో ఉంటారని, ఏదైనా సమస్యలుంటే వెంటనే తెలియజేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థినుల కోసం ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలు, రంగవల్లుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు.