వెలుగొండ ప్రాజెక్టు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజల్లో ఆశలను రేకెత్తించిందని, కానీ వైసీపీ నేతలు అసూయతో విషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో వెలుగొండ ప్రాజెక్టుకు బలమైన పునాదులు వేసినట్లు ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఒక బిందె నీళ్లు తేకుండానే జనాలకు అంకితం చేసిన ఘనత వైసీపీ పాలకులదేనని అన్నారు. ప్రజలకు ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
వైసీపీ పాలనలో వెలుగొండ ప్రాజెక్టు ముందుకు సాగలేదని, కానీ నేటి ఎన్డీయే కూటమి దానిని పూర్తి చేసి రైతాంగానికి జలాలను అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. మాటలకే పరిమితమైన వైసీపీతో పోలిస్తే, తెలుగుదేశం పార్టీ చేతలతో పనిచేసే ప్రభుత్వం అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి గురించి వైసీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని, తమ హయాంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యమని అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల కష్టాలను తాము అర్థం చేసుకుంటామని, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి, రైతులకు జీవనాధారం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.