బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పోరేషన్ కార్యాలయం, స్టాచు మరియు STU భవనాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, శాసన సభ్యులు పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సంఘ నాయకులు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, జగ్జీవన్ రామ్ సేవలు భారత దేశ చరిత్రలో చిరస్మరణీయమని, నేటితరం విద్యార్థులు ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన అనుసరించిన మార్గం సమానత్వం, సమాజ శ్రేయస్సు పట్ల ఆయన ఉన్న తపనను తెలియజేస్తుందని అన్నారు.
జగ్జీవన్ రామ్ 1908లో బీహార్ రాష్ట్రంలోని చాంద్వా గ్రామంలో జన్మించి, చిన్ననాటి నుండే వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన విద్యాభ్యాసాన్ని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కొనసాగించి, 1928లో కాంగ్రెస్‌లో చేరారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారి చేతిలో అరెస్టయ్యారు.
స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగ సభ సభ్యుడిగా, తరువాత లొక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. కార్మిక, వ్యవసాయ, రవాణా, రక్షణ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1979లో ఉపప్రధానమంత్రిగా సేవలందించారు. ఆయన సమానత్వం, సామాజిక న్యాయ పట్ల చూపిన నిబద్ధత ఇప్పటికీ ప్రేరణగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.