కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌కు చెందిన నిమ్మల బోయిన సందీప్ (29) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, హైదరాబాద్ అల్వాల్‌లో తన రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్‌ల నుంచి వచ్చిన వేధింపులు, స్టాక్ మార్కెట్‌లో వచ్చిన నష్టాలు ఈ నిర్ణయానికి దారితీశాయని కుటుంబ సభ్యులు వాపోయారు.
సందీప్ తన అవసరాలకు మించి క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు తీసుకొని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. కానీ వరుసగా నష్టాలు రావడంతో అప్పులు పెరిగిపోయాయి. అదేవిధంగా, లోన్ యాప్‌లు తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేకపోవడంతో ఏజెంట్లు అసభ్యకరంగా మెసేజ్‌లు పంపుతూ, ఫోటోలు ఎడిట్ చేసి షేర్ చేస్తామంటూ బెదిరించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు.
మొత్తంగా ఆయన సుమారు 20 లక్షల వరకు అప్పులు చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటికి ఏజెంట్లు రావడం, ఇంట్లోని వారిని బెదిరించడం వల్ల హైదరాబాద్‌కు వెళ్లిపోయిన సందీప్ అక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆ పరిసరాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
సందీప్‌కు ఐదు నెలల క్రితమే వివాహం జరిగినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి వేదనను వ్యక్తపరుస్తూ, నిబంధనలు లేని లోన్ యాప్‌లపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి విషాదాలు మరెవరికీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.