Esha Singh: భారత యువ షూటర్ ఇషా సింగ్ అంతర్జాతీయ షూటింగ్ వేదికపై మరో ప్రతిష్టాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. జర్మనీలోని మునిచ్ వేదికగా జరుగుతున్న ISSF వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ పోటీలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆమె బంగారు పతకాన్ని గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచింది.
ఫైనల్లో 43 పాయింట్లు సాధించిన ఇషా సింగ్ అగ్రస్థానంలో నిలిచి కొత్త రికార్డును సృష్టించింది. ఈ విభాగంలో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోర్‌గా నమోదైంది. గతంలో దక్షిణ కొరియా షూటర్ కిమ్-యేజీ పేరిట ఉన్న 42 పాయింట్ల రికార్డును ఇషా అధిగమించింది.
ఈ ఈవెంట్‌లో మొత్తం 50 పాయింట్ల వరకు సాధించే అవకాశం ఉండగా, ఇషా ప్రదర్శనను క్రీడా విశ్లేషకులు అద్భుతంగా అభివర్ణిస్తున్నారు.
ఇషా సింగ్ సాధించిన ఈ విజయంపై నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI), క్రీడా ప్రముఖులు, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.








