టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్‌లో ఘన సన్మానం లభించింది. ప్రముఖ సంస్థ బ్రిడ్జ్ ఇండియా బృందం ఆయనకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. ఈ కార్యక్రమానికి పలువురు పార్లమెంటు సభ్యులు, మంత్రులు, సహాయ మంత్రులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు. చిరంజీవి సినీ పరిశ్రమకు అందించిన సేవలు, మానవతా కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు.
ఈ గౌరవాన్ని స్వీకరించిన అనంతరం చిరంజీవి తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘ఇంతమంది ప్రముఖుల సమక్షంలో ఈ గౌరవాన్ని అందుకోవడం నాకు గర్వకారణం. బ్రిడ్జ్ ఇండియా ఇచ్చిన జీవితకాల సాఫల్య పురస్కారం నన్ను ఆనందపరిచింది. ఇది నా అభిమానులు, కుటుంబ సభ్యులు, సినీ కుటుంబం, శ్రేయోభిలాషులు అందరికీ చెందింది’’ అని అన్నారు.
చిరంజీవి తన అభిమానుల గురించి మాట్లాడుతూ, ‘‘నా రక్తదాన సహోదరులు, మానవతా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గౌరవం నన్ను మరింత ఉత్సాహంగా ముందుకు సాగేందుకు ప్రేరేపిస్తుంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన యూకే పార్లమెంట్‌లో జరిగిన సన్మానం తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
చిరంజీవికి ఈ పురస్కారం లభించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు మాత్రమే కాకుండా మానవ సేవకు కూడా ఆయన చేసిన కృషికి ఇది గౌరవప్రదమైన గుర్తింపు అని మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘనత చిరంజీవి ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందేందుకు దోహదం చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



