Donald Trump: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు ప్రాంతీయ భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలు, డ్రోన్ మౌలిక సదుపాయాలపై అమెరికా వైమానిక దాడులు జరిపినట్లు సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ దాడుల తర్వాత ఫార్స్, హర్మోజ్‌గన్, ఇలామ్, కెర్మన్, సిస్తాన్-బలూచిస్థాన్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. దీనికి ప్రతిగా కువైట్‌లోని కీలక విద్యుత్ కేంద్రాలు, డీసాలినేషన్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది.
జోర్డాన్ మూడు క్షిపణులు, ఐదు డ్రోన్లను అడ్డుకున్నట్లు ప్రకటించగా, బహ్రెయిన్ వైపునకూ క్షిపణులు దూసుకెళ్లినట్లు సమాచారం. హర్మూజ్ జలసంధిలో ట్యాంకర్‌పై కూడా దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా, ఇరాన్‌తో ప్రస్తుతం శాంతి చర్చలపై ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ ప్రతినిధి బృందం పాకిస్థాన్‌లో ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమై పరిస్థితులపై చర్చించింది.
ఈ సందర్భంగా అమెరికా, ఇరాన్ సంయమనం పాటించాలని పాక్ విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సౌదీ అరేబియాలో కీలక భేటీలు నిర్వహించి ప్రాంతీయ భద్రత, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.








