200% tariffs: అమెరికాకు ఎగుమతి అయ్యే జెనరిక్ ఔషధాలపై భారీ సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దేశీయ ఔషధ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆయన ప్రకటించిన కొత్త విధానం ప్రకారం 2026 ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న టారిఫ్ వ్యవస్థలో తొలి రెండేళ్లు సుంకం ఉండదు. అనంతరం మూడో ఏడాది నుంచి 100 శాతం, ఆ తర్వాత 200 శాతం వరకు టారిఫ్‌లు అమలు చేయనున్నట్లు తెలిపారు. అమెరికాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వడమే ఈ నిర్ణయం ఉద్దేశమని చెప్పారు. అయితే పేటెంట్ కలిగిన బ్రాండెడ్ ఔషధాలపై ప్రస్తుతం అమలులో ఉన్న విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద జెనరిక్ ఔషధాల ఎగుమతిదారైన భారత్‌పై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలో వినియోగించే జెనరిక్ మందుల్లో సుమారు 40 శాతం భారత కంపెనీల నుంచే సరఫరా అవుతున్నాయి. 2024-25లో భారత్ నుంచి అమెరికాకు 9.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు ఎగుమతి కాగా, ఇది దేశ మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 38 శాతం వాటాను కలిగి ఉంది.
కొత్త టారిఫ్‌లు అమల్లోకి వస్తే అమెరికా మార్కెట్‌పై ఆధారపడిన భారత ఫార్మా కంపెనీలపై ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో దీనిపై ఎలాంటి నిర్ణయాలు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
ALSO READ: Donald Trump | ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ మెసేజ్.. ‘చర్చలు ఇప్పుడే కాదు’








