CM Chandrababu Naidu: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మున్సిపల్ ఎన్నికలతో పాటు పరిషత్ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి మద్దతు లభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ విజయంపై ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం, పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్ సాధించినట్లు పేర్కొన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్లు.. ఏ విధానంలో ఎన్నికలు జరిగినా కూటమి విజయం సాధించిందని సీఎం వెల్లడించారు.
సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో కూటమి ఓట్ల శాతం 3.6 శాతం పెరిగిందని సీఎం చంద్రబాబు వివరించారు. మరోవైపు, వైసీపీ ఓట్ల శాతం 39.8 నుంచి ఆరు శాతానికి పైగా తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సీఎం తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే అభ్యర్థులను ఖరారు చేశామని, ఎన్నికల నిర్వహణను సమన్వయం చేసేందుకు ప్రత్యేక వార్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా, స్థానిక ఎన్నికల ఫలితాలను తమ రెండున్నరేళ్ల పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
ALSO READ: Samantha | 12 ఏళ్ల క్రితమే సమంతకు పండితుడి జోస్యం.. ఇప్పుడు నిజమైందా?
