Boyapati Srinu: సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను.. స్థానిక ఎన్నికల్లో ఓటరుగా తన బాధ్యతను నిర్వర్తించారు. స్వగ్రామంపై తనకున్న అనుబంధాన్ని చాటుకుంటూ గుంటూరు జిల్లా పెదకాకానిలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెదకాకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన.. సాధారణ ఓటరులాగే క్యూలో నిలబడి ఓటు వేశారు. అనంతరం అక్కడి మీడియాతో మాట్లాడారు. పెదకాకాని గ్రామం గతంతో పోలిస్తే ఎంతో అభివృద్ధి చెందిందని బోయపాటి శ్రీను పేర్కొన్నారు. ప్రతి ఓటరూ తమ ప్రజాస్వామ్య బాధ్యతను గుర్తించి ఓటింగ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని చెప్పారు. ఇక పెదకాకానితో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఈ ఊరే నా కుటుంబం’ అంటూ బోయపాటి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి, సినీ ప్రముఖుడిగా బిజీగా ఉన్నప్పటికీ స్వగ్రామానికి వచ్చి ఓటు వేసిన బోయపాటి శ్రీను.. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య బాధ్యతను గుర్తించాలని తన చర్యతో చాటిచెప్పారు.
Boyapati Srinu | సామాన్యుడిలా క్యూలో నిలబడి ఓటేసిన స్టార్ డైరెక్టర్ బోయపాటి
7
