Meta layoffs 2026: టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరిస్తుండటంతో ఐటీ కంపెనీల పని విధానాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు ఏఐ కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్న సంస్థలు.. మరోవైపు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కూడా ఉద్యోగులకు స్వచ్ఛందంగా సంస్థను వీడే అవకాశం కల్పించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ఫ్రాన్స్ ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్
ఫ్రాన్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం మెటా స్వచ్ఛంద నిష్క్రమణ పథకాన్ని ప్రతిపాదించినట్లు అక్కడి మీడియా సంస్థ ‘లా లెటర్’ వెల్లడించింది. ప్రస్తుతం ఆ దేశంలో సుమారు 300 మంది మెటా ఉద్యోగులు ఉండగా.. ఈ పథకం ద్వారా దాదాపు 100 మంది వరకు బయటకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఏ విభాగాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందో స్పష్టత లేదు.
భారీ పరిహారం.. పది నెలల ప్రత్యేక వెసులుబాటు
ఫ్రాన్స్ కార్మిక చట్టాల పరిధిలోని కలెక్టివ్ కాంట్రాక్చువల్ టెర్మినేషన్ విధానం ద్వారా ఈ ప్రక్రియ చేపట్టాలని మెటా భావిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగులు, కార్మిక సంఘాలతో చర్చించి పరస్పర అంగీకారంతో సిబ్బందిని తగ్గించుకోవడం ఈ విధానం ప్రత్యేకత. ఈ పథకంలో చేరే ఉద్యోగులకు పనిచేసిన ప్రతి ఏడాదికి 2.15 నెలల వేతనానికి సమానమైన పరిహారం ఇవ్వాలని ప్రతిపాదించినట్లు కథనం పేర్కొంది. అదనంగా పది నెలల పాటు మొబిలిటీ లీవ్‌తోపాటు ఆ సమయంలో స్థూల వేతనంలో 80 శాతం చెల్లించే అవకాశం ఉంది. కొత్త నైపుణ్యాల శిక్షణ, స్వంత వ్యాపారం ప్రారంభించేందుకు కూడా సహకారం అందించాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలోనూ ఇదే తరహా నిర్ణయం
ఫ్రాన్స్‌లో ఈ ప్రతిపాదనపై జులై నుంచి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 2023లోనూ మెటా ఇదే తరహా ఒప్పందం ద్వారా 350 మంది ఉద్యోగుల్లో 88 మందికి సంస్థను వీడే అవకాశం కల్పించింది. ప్రపంచవ్యాప్తంగా మెటాలో సుమారు 66 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం సిబ్బందిలో 10 శాతానికి సమానమైన 8 వేల ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికను ప్రకటించింది. మేలో మరో 7 వేల మందిని ఏఐ సంబంధిత విభాగాలకు బదిలీ చేయాలని నిర్ణయించింది.
ఏఐ పెట్టుబడులు.. ఉద్యోగులపై ప్రభావం
మరోవైపు 2026లో డేటా సెంటర్లు, డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం 135 నుంచి 145 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని మెటా లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐతో తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పనులు చేయగలుగుతున్నామని సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గతంలో వ్యాఖ్యానించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ బాటలో మెటా కూడా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాలపై దృష్టి పెట్టడం టెక్ రంగంలో మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతోంది. ఫ్రాన్స్‌లో అమలయ్యే ఈ విధానాన్ని ఇతర దేశాలకూ విస్తరిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ALSO READ: SS Rajamouli Ramayana Review | రామాయణం విజువల్స్ అద్భుతం.. రాజమౌళి ప్రశంసల వర్షం
