LIVE
Thursday, November 5, 2026
LIVE
LIVE

Supreme Court | అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టుకు హాజరు చేయాల్సిందే.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

by Bajaswamy
7 views
Supreme Court

Supreme Court: ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు అనుసరించాల్సిన నిబంధనలపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేస్తూ.. నిర్బంధానికి సంబంధించిన 24 గంటల నిబంధనను కచ్చితంగా పాటించాలని పోలీసు యంత్రాంగానికి సూచించింది.

24 గంటల్లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరు తప్పనిసరి

రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ప్రకారం, అదుపులోకి తీసుకున్న వ్యక్తిని 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ గడువులో అరెస్టయిన ప్రదేశం నుంచి న్యాయస్థానానికి చేరుకునేందుకు పట్టే ప్రయాణ సమయాన్ని మాత్రమే మినహాయించవచ్చని వివరించింది. అంతకుమించి ఆలస్యం చేయడానికి అనుమతి లేదని పేర్కొంది. గడువు దాటినా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకపోతే నిర్బంధాన్ని కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ చంద్రుర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఓ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. బీఎన్ఎస్ సెక్షన్ 28 ప్రకారం కూడా నిర్బంధితుడిని వీలైనంత త్వరగా మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టే బాధ్యత విచారణ అధికారిపై ఉంటుందని పేర్కొంది.

అరెస్ట్ సమయాన్ని నమోదు చేయాలి

banner

నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టేటప్పుడు అతడి వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. నిర్బంధించిన తేదీ, సమయాన్ని అధికారికంగా నమోదు చేయడం తప్పనిసరని తెలిపింది. ఈ వివరాలను మెజిస్ట్రేట్లు, ఉన్నత న్యాయస్థానాలు జాగ్రత్తగా పరిశీలించాలని పేర్కొంది. అవసరానికి మించి నిర్బంధం కొనసాగిందా లేదా అన్నది కూడా సమీక్షించాలని స్పష్టం చేసింది. 24 గంటల పరిమితి ఉల్లంఘన జరిగినట్లు గుర్తిస్తే రిమాండ్‌ను తిరస్కరించే అవకాశం ఉందని ధర్మాసనం తెలిపింది. మొత్తంగా, అరెస్ట్ పేరుతో పౌరుల స్వేచ్ఛకు భంగం కలగకూడదన్నదే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రధాన ఉద్దేశం. చట్టబద్ధమైన నిర్బంధ ప్రక్రియను పోలీసులు పాటించడంతో పాటు, న్యాయాధికారులు కూడా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని ఈ తీర్పు మరోసారి గుర్తుచేస్తోంది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More