Bandi Sanjay Kumar: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతలమ్మ గుండెపోటుకు గురికావడంతో ఆమెను అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది.
గుండెపోటు రావడంతో ఆసుపత్రి వైద్యులు వెంటనే స్పందించి ప్రత్యేక కార్డియాలజిస్టుల బృందంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అత్యవసరంగా యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేసినట్లు సమాచారం. ప్రస్తుతం శకుంతలమ్మను ఐసీయూలో ఉంచి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
తల్లి అనారోగ్య వార్త తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని నేరుగా మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతున్న తన తల్లిని పరామర్శించారు.
అనంతరం వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. శకుంతలమ్మ త్వరగా కోలుకోవాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.








