CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిపారు. ముందుగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసిన సీఎం వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పర్యావరణ అనుమతులు, అటవీ సంరక్షణ, ప్రజా ప్రయోజన ప్రాజెక్టుల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
రాష్ట్రంలో చేపడుతున్న ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని సీఎం కేంద్రాన్ని కోరారు. అనంతరం కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మసాగర్, డిండి, గౌరవెల్లి వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని మహారాష్ట్రతో చర్చలకు సహకరించాలని కోరారు.
గ్రావిటీ ఆధారంగా నీటి సరఫరా సాధ్యాసాధ్యాలను వివరిస్తూ 150 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం లభిస్తే తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ALSO READ: Tamil Nadu Budget | తమిళనాడులో విజయ్ మార్క్ బడ్జెట్.. సంక్షేమం-విద్యకు పెద్దపీట








