Bhogapuram Airport: భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ చూపుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఈ విమానాశ్రయం కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల పురోగతికి బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని గుర్తుచేసిన పవన్ కల్యాణ్, తెలుగు జాతి ఎప్పుడూ ఎవరికీ తలవంచదని ఆయన గర్జించిన మాటలు నేటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. అదే ఆత్మవిశ్వాసంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ లక్ష్యంతో వేగంగా ముందుకు వెళ్తోందని, 140 కోట్ల మంది భారతీయుల ఆశయాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల్లో వేగంగా అభివృద్ధి సాధించి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రకు ప్రపంచ స్థాయి అనుసంధానం లభిస్తుందని, ఇది ప్రాంతీయ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.








