Zimbabwe T20 series: “అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తొలి సిరీస్‌లోనే తన ముద్ర వేసిన యువ బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మార్మోగుతోంది…” అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ, తొలి అవకాశాన్ని అద్భుత ప్రదర్శనగా మలిచి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకున్న వైభవ్.. 151 పరుగులు సాధించి సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 196.10 స్ట్రైక్ రేట్‌తో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి భారత్ 3-0తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని అందుకున్నాడు.
ఈ టీ20 సిరీస్ వైభవ్ సూర్యవంశీ కెరీర్లో ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. తొలి మ్యాచ్‌లోనే 15 ఏళ్ల 118 రోజుల వయసులో అర్ధశతకం బాదిన అతడు, అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా భారత జట్టు తరఫున అతి పిన్న వయసులో అంతర్జాతీయ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఇక సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో 49 బంతుల్లో 81 పరుగులతో చెలరేగిన వైభవ్.. 16 ఏళ్లు పూర్తి కాకముందే రెండు టీ20 అర్ధశతకాలు సాధించిన ప్రపంచ తొలి క్రికెటర్‌గా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఐసీసీ ఫుల్ మెంబర్ దేశం తరఫున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా కూడా వైభవ్ గుర్తింపు పొందాడు. చిన్న వయసులోనే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకోవడం అతడి ప్రతిభకు మరో నిదర్శనం. భారీ షాట్లు, ఆత్మవిశ్వాసంతో కూడిన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో భారత క్రికెట్లో కీలక ఆటగాడిగా ఎదుగుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
ALSO READ: Bhatti Vikramarka | ఖాళీ కడుపుతో క్లాస్‌కు వెళ్లొద్దు.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన








