Scheduled Caste: మతం మారితే షెడ్యూల్డ్ కుల హోదా కూడా కోల్పోతారా? అనే ప్రశ్నకు సుప్రీంకోర్టు(Supreme Court) మరోసారి స్పష్టమైన సమాధానం ఇచ్చింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు మినహా ఇతర మతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. మార్చి 2026లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో, క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తించవని స్పష్టం చేసింది.
మతం మారిన వెంటనే ఎస్సీ హోదా స్వయంచాలకంగా రద్దవుతుందని, ఎస్సీ సర్టిఫికెట్ ఆధారంగా ప్రయోజనాలు పొందడం చట్టబద్ధం కాదని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు తీర్పు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చింది. ఇతర మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదని, ఆ హోదా పునరుద్ధరణకు చట్టంలో పేర్కొన్న మూడు షరతులు తప్పనిసరిగా నెరవేర్చాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. దీంతో మత మార్పిడి, రిజర్వేషన్ హక్కులకు సంబంధించిన ఈ అంశంపై మరోసారి న్యాయపరమైన స్పష్టత వచ్చినట్లైంది.
ALSO READ: Dhanush | అవార్డులు కాదు.. ప్రేక్షకుల ప్రేమే ముఖ్యం: ధనుష్ కామెంట్స్ వైరల్








