Apple: ప్రపంచ టెక్నాలజీ రంగంలో అగ్రస్థానం కోసం సాగుతున్న పోటీలో యాపిల్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మార్కెట్ విలువ పరంగా ఇప్పటివరకు ముందంజలో ఉన్న ఎన్విడియాను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా యాపిల్ నిలిచింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి యాపిల్ మార్కెట్ విలువ 4.88 ట్రిలియన్ డాలర్లకు చేరగా, ఎన్విడియా విలువ 4.86 ట్రిలియన్ డాలర్ల వద్ద నమోదైంది.
గత ఏడాది ఏఐ చిప్‌లకు పెరిగిన డిమాండ్‌తో ఎన్విడియా అగ్రస్థానాన్ని కాపాడుకున్నప్పటికీ, తాజా ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 3.5 నుంచి 3.9 శాతం వరకు పడిపోవడం దానికి ప్రతికూలంగా మారింది. చైనాకు చెందిన ‘మూన్‌షాట్’ స్టార్టప్ కొత్త ఏఐ మోడల్‌ను ప్రకటించడం, ఓపెన్‌ఏఐకు పోటీ పెరగనున్న సంకేతాలు కూడా ఎన్విడియా షేర్లపై ప్రభావం చూపినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు యాపిల్ షేర్లు స్థిరంగా పెరగడంతో కంపెనీ మార్కెట్ విలువ మరింత బలపడింది. ముఖ్యంగా చైనాలో ‘Apple Intelligence’ ఏఐ ఫీచర్లకు నియంత్రణ సంస్థల అనుమతి లభించడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచింది. దీంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి యాపిల్ షేరు దాదాపు 22 శాతం లాభపడగా, మరోసారి ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా రికార్డు సృష్టించింది.








