భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పేరు మరోసారి యువ క్రికెట్‌లో మార్మోగుతోంది. అయితే ఈసారి వార్తల్లో నిలిచింది ఆయన చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్. శ్రీలంక అండర్-19(U-19) జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డేలో అన్వయ్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుని భారత జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించాడు. క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి ఒత్తిడిని ఏమాత్రం లెక్కచేయకుండా ఆత్మవిశ్వాసంతో ఆడిన అతడు తన ప్రతిభను మరోసారి నిరూపించాడు.
మహింద రాజపక్స అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయి జట్టు ఇబ్బందుల్లో పడింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన అన్వయ్ ద్రవిడ్, అర్జున్ రాజ్‌పుత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఇద్దరూ ఐదో వికెట్‌కు 145 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గట్టి స్థితికి చేర్చారు.
అన్వయ్ కేవలం 67 బంతుల్లో 87 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, ఒక భారీ సిక్సర్ ఉన్నాయి. దూకుడుగా ఆడిన అన్వయ్ 47 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. శతకానికి చేరువలో ఉన్న సమయంలో వికెట్ కోల్పోయినా, అతని ఇన్నింగ్స్ భారత్‌కు బలమైన స్కోరు అందించడంలో కీలకంగా మారింది.
మరోవైపు అర్జున్ రాజ్‌పుత్ కూడా 76 పరుగులతో విలువైన సహకారం అందించాడు. అయితే చివరి ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయిన భారత్ 47.2 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్ గిమ్హాన్ మెండిస్ ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
ఇటీవల వినూ మన్కడ్ ట్రోఫీలోనూ అద్భుత ప్రదర్శన చేసిన అన్వయ్ ద్రవిడ్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో రానున్న అండర్-19 ప్రపంచకప్ జట్టులో తన స్థానాన్ని మరింత బలపరిచే సంకేతాలు ఇచ్చాడు. తండ్రి రాహుల్ ద్రవిడ్ అడుగుజాడల్లో నడుస్తూ భారత క్రికెట్‌కు మరో ప్రతిభావంతుడిగా ఎదుగుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.








