Actor Vishal: సీఎం విజయ్ను కలిసిన అనంతరం నటుడు, నిర్మాత విశాల్ షేర్ చేసిన సందేశం ప్రస్తుతం అభిమానుల్లో వైరల్‌గా మారుతోంది. ఆయన తన పోస్టులో విజయ్ను ప్రేమతో “డార్లింగ్ సీఎం విజయ్” అని సంబోధించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. లయోలా కాలేజీ రోజుల నుంచే విజయ్ను తాను ‘డార్లింగ్’ అని పిలుస్తున్నానని విశాల్ పేర్కొన్నారు. ఆ పిలుపు ఇప్పటికీ కొనసాగుతుందని, వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా అదే ఆప్యాయత కనిపించిందని తెలిపారు. విజయ్ సినీ రంగంలో సాధించిన ప్రగతి తనను ఎంతో ప్రభావితం చేసిందని ఆయన అన్నారు.
ఒక సాధారణ నటుడిగా ప్రారంభమైన విజయ్ ప్రయాణం నేడు సూపర్‌స్టార్ స్థాయికి చేరి, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఎంతో గర్వకారణమని విశాల్ ప్రశంసించారు. ఎన్నో విమర్శలు, సవాళ్లను ఎదుర్కొంటూ విజయ్ తన లక్ష్యాన్ని సాధించారని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ విజయ్ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదని విశాల్ స్పష్టం చేశారు.
గతంలో కలిసినప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పటికీ అదే వినమ్రత, ఆప్యాయత కొనసాగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గతంలో కరుణానిధి, జయలలిత, స్టాలిన్, ఉదయనిధి వంటి నాయకులతో తన అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఇక ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో సంప్రదాయంగా ఇచ్చే బొకే, శాలువా వంటి వాటికి బదులుగా ఆ ఖర్చును ముగ్గురు నిరుపేద బాలికల విద్య కోసం వినియోగించినట్లు విశాల్ వెల్లడించారు.
ఆ సహాయాన్ని సీఎం విజయ్ పేరుతో అందించామని తెలిపారు. ఈ చర్య ఆ బాలికల జీవితంలో మార్పు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ విశాల్ తన సందేశాన్ని ముగించారు.








