Rashmika Mandanna: పాన్-ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ప్రముఖ నటి రశ్మిక మందన్నకు చిత్రీకరణ సమయంలో తీవ్ర గాయం కావడంతో సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓ డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా ఆమె తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ పరిణామం సినీ పరిశ్రమలోనే కాకుండా అభిమానుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రశ్మిక ‘రణబాలి’, ‘మైసా’ చిత్రాల షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. ఈ సినిమాల కోసం కఠినమైన డ్యాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్న సమయంలో ఆమె హిప్ ప్రాంతంలో టెండన్ డిటాచ్‌మెంట్ (Tendon Detachment) అయినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి గాయాలు తీవ్ర శారీరక శ్రమ చేసే క్రీడాకారుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాబోయే ఆరు వారాలు ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. టెండన్ పూర్తిగా కోలుకోవడానికి ప్రత్యేక రీహాబిలిటేషన్ చికిత్స కూడా అవసరమని తెలిపారు. దీంతో ఆమె నటిస్తున్న సినిమాల షూటింగ్‌లు, కమర్షియల్ ప్రకటనల చిత్రీకరణలు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రశ్మిక చేతిలో నాలుగు భారీ పాన్-ఇండియా చిత్రాలతో పాటు దాదాపు 30 ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు ఉన్నాయి. ఈ గాయం కారణంగా ఆమె వృత్తిపరమైన షెడ్యూల్‌పై ప్రభావం పడే అవకాశముంది. అయితే రశ్మిక త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లలో పాల్గొనాలని అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు.
ALSO READ: Union Cabinet | కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.. రూ.4.25 లక్షల కోట్లతో నాలుగు మెగా పథకాలు








